
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన అక్రమ అండాల సేకరణ వ్యవహారం మరింత తీవ్రతరం అవుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా మరో ఐదు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు (డీఎంహెచ్వోలు) ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్స్ నిర్వాహకులపై పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మియాపూర్, మహంకాళి, మలక్‌పేట పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అండాల దానానికి ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో మహిళకు రూ.30 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపి అంగీకరింపజేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండానే హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
మహిళలను తీసుకొచ్చే మధ్యవర్తులకు ఒక్కొక్కరికి రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అండాల సంఖ్య, నాణ్యత ఆధారంగా మధ్యవర్తుల చెల్లింపుల్లో 50 శాతం కోత విధించే నిబంధనలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే మల్కాజ్గిరి పరిధిలో నమోదైన మూడు కేసుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్