
అమరావతి , 14 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కన్నూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలోని బాత్రూమ్లో ఓ కాగితంపై బాంబు ఉన్నట్లు రాసి ఉంచడాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన పైలట్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాంబు నిర్వీర్యకరణ బృందాలు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
విమానంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదు. దీంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానంలో బాంబు ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్