
అమరావతి , 16 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న సుదీర్ఘ న్యాయ వివాదానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెరదించింది. చట్టప్రకారం అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఖరారైనందున, ఇకపై 'మూడు రాజధానుల' అంశానికి సంబంధించిన పిటిషన్లకు కాలం చెల్లినట్లేనని (Infructuous) హైకోర్టు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ మరియు దానికి మద్దతుగా దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (PILs) విచారించిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో 'అమరావతి బిల్లు' ఆమోదం పొందడం మరియు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన చట్టం తీసుకురావడంతో పాత వివాదాలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని కోర్టు అభిప్రాయపడింది. మూడు రాజధానుల చట్టాన్ని గతంలోనే ఉపసంహరించుకోవడం, ప్రస్తుత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించడాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. దీంతో పాటు అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర చట్టం ద్వారా రక్షణ కల్పించే అంశం కూడా చర్చలో ఉంది. హైకోర్టు తాజా తీర్పుతో రాజధాని ప్రాంత రైతులు, ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిందని, అమరావతి అభివృద్ధికి న్యాయపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్