'అక్వాన్' తుఫాను ముప్పు: ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా బలపడి 'అక్వాన్' (Cyclone Akvan) తుఫానుగా మారే సూచనలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
Chandrababu Naidu


అమరావతి , 16 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా బలపడి 'అక్వాన్' (Cyclone Akvan) తుఫానుగా మారే సూచనలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం, ఈ తుఫాను నవంబర్ 20న మధ్యాహ్నం సమయంలో నెల్లూరు మరియు తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 120 నుండి 130 కిలోమీటర్ల వేగంతో (గరిష్టంగా 145 కి.మీ. వరకు) పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

నవంబర్ 18 నుండి 20 వరకు కోస్తాంధ్ర వ్యాప్తంగా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తక్షణమే వెనక్కి రప్పించాలని, నవంబర్ 20 వరకు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande