
అమరావతి , 16 నవంబర్ (హి.స.)ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన 'మురసు' తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,484 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. కేంద్ర బృందం నాలుగు ప్రభావిత జిల్లాల్లోని సుమారు 60 ప్రాంతాల్లో పర్యటించి పంటలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది.
తుఫాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు, నీటిపారుదల కాలువలు ధ్వంసమయ్యాయని సీఎం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ రంగంలో 10,192 హెచ్‌టీ (11 కేవీ) స్తంభాలు, 6,442 ఎల్టీ స్తంభాలు, 1,448 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 3,859 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. తక్షణ సహాయక చర్యలు, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 37 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో నష్టం చాలా తీవ్రంగా ఉందని అంగీకరించిన కేంద్ర అధికారులు, త్వరలోనే సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. మరో తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్