
అమరావతి , 16 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో శిశు మరణాల రేటును తగ్గించడం మరియు నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. 'సేఫ్ సురక్ష బాల శిశు కార్యక్రమం' (SSBSK) కింద వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (CHOs), ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు (DMHOs) ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఆసుపత్రుల్లోని ఎస్ఎన్సీయూ (SNCU), ఎన్ఐసీయూ (NICU) వార్డుల నుండి డిశ్చార్జ్ అయిన ప్రతి శిశువు వివరాలను 'శైశవ్' (Shaishav) యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఆ పిల్లల ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు శిశువు పుట్టిన 1వ, 3వ మరియు 7వ రోజుల్లో నేరుగా ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. 28వ రోజున అంగన్వాడీ కార్యకర్తలు శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. దీనికి తోడు, చిన్నపిల్లల్లో న్యుమోనియా వ్యాధిని ముందస్తుగా గుర్తించి నివారించేందుకు 'సాన్స్' (SAANS) కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు నిరంతర దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్