ఏపీలో జీవనశైలి వ్యాధుల కలవరం: NCD సర్వేలో కీలక గణాంకాలు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రజలను జీవనశైలి వ్యాధులు (Non-Communicable Diseases - NCD) తీవ్రంగా వేధిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఆరోగ్య సర్వేలో వెల్లడైంది.
ఏపీలో జీవనశైలి వ్యాధుల కలవరం: NCD సర్వేలో కీలక గణాంకాలు వెల్లడి


అమరావతి , 16 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రజలను జీవనశైలి వ్యాధులు (Non-Communicable Diseases - NCD) తీవ్రంగా వేధిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 నెలల పాటు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి నిర్వహించిన ఈ సర్వే తుది నివేదికను అధికారులు విడుదల చేశారు. ఈ సర్వేలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి ఆందోళన కలిగించే గణాంకాలు బయటపడ్డాయి.

సర్వే వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 59.63 లక్షల మందికి అధిక రక్తపోటు (Hypertension/బీపీ) ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 12.23 లక్షల మందికి ఈ సర్వే ద్వారానే కొత్తగా బీపీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 48.95 లక్షల మంది మధుమేహం (Diabetes/షుగర్) వ్యాధితో బాధపడుతుండగా, అందులో 11.58 లక్షల మంది కొత్త బాధితులను గుర్తించారు. వీటితో పాటు, సర్వేలో భాగంగా నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో 12,768 క్యాన్సర్ కేసులు కూడా బయటపడటం గమనార్హం. వ్యాధి నిర్ధారణ అయిన వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు మరియు చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. జీవనశైలి వ్యాధుల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను నివారించేందుకు ముందస్తు గుర్తింపు, క్రమం తప్పకుండా మందులు వాడటం ఎంతో అవసరమని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande