
అమరావతి , 16 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) భారీ ప్రణాళికలను అమలు చేస్తోంది. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పారిశ్రామిక అవసరాల కోసం ఏకంగా 24,673 ఎకరాల భూమిని ఏపీఐఐసీ తన ఆధీనంలోకి తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.1 లక్షల ఎకరాలకు పైగా పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉండగా, అందులో 45,664 ఎకరాలు తక్షణ కేటాయింపులకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో 25 సెక్టార్-స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పార్కులను (ప్రత్యేక పారిశ్రామిక పార్కులు) అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు, 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పార్కుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గత రెండున్నరేళ్లలో రూ. 17.11 లక్షల కోట్ల విలువైన 526 పెట్టుబడి ప్రతిపాదనలను ప్రాజెక్టులుగా మార్చగా, అందులో రూ. 7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 432 ఎకరాలను కేటాయించగా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 289 కిలోమీటర్ల రోడ్లు, 370 కిలోమీటర్ల నీటి పైప్లైన్లను నిర్మించినట్లు ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్