
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. సోమవారం, నవంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఆయన నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, దగ్గరి స్నేహితుల మధ్య ఈ వేడుకను జరిపారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా వచ్చి కాబోయే జంటను ఆశీర్వదించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రావడంతో అక్కడ సందడి నెలకొంది.
ఈ వేడుకకు గవర్నర్‌తో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి టి. హరీశ్ రావు కూడా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంతసేపు వేడుకలో గడిపారు.
సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, శ్రీకాంత్, శివాజీ తదితరులు వచ్చారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు కూడా హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకులు కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని ఈ వేడుకకు విచ్చేశారు. నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి, రచయిత, దర్శకుడు కోన వెంకట్ తదితరులు కూడా పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో తాజ్ కృష్ణ హోటల్ కళకళలాడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..