
శ్రీనగర్, 16 నవంబర్ (హి.స.)
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా (LeT) కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ లతీఫ్ భట్ ఉన్నట్లు భద్రతాధికారులు గుర్తించారు. కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భారత సైన్యం, సీఆర్పీఎఫ్ మరియు జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు దీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లతీఫ్ భట్‌తో పాటు మరో ఉగ్రవాది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ సమయంలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. హతమైన ఈ ఉగ్రవాదులు గత వారం సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై జరిగిన దాడిలో ప్రధాన నిందితులని ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారేమోనని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi