
రాయ్పూర్/హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
తెలంగాణ నీటిపారుదల రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్తో సమావేశమయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో ప్రధానంగా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీకి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని తెలంగాణ సీఎం కోరారు. దీనికి ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందిస్తూ, ఎన్ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎల్నినో ప్రతికూల పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో తెలంగాణకు నీటి అవసరాలు గణనీయంగా పెరగనున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటికే సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, 83 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టం వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం దీనికి ఉందని తెలిపారు. సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్గఢ్ భూభాగంలో ముంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఛత్తీస్గఢ్లో కేవలం 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందని, అత్యంత భారీ వరదలు వచ్చినప్పుడు కూడా ఇది 100 ఎకరాలకు మించదని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ పరిధిలో అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాలకు అయ్యే పూర్తి నిధులను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన సాంకేతిక అనుమతులపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi