
అమరావతి , 19 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పాలనకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభమైంది. నేటి నుంచి ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం అధికారికంగా మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్‌లకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికైన సభ్యులు తమ మండలాలకు నాయకత్వం వహించే అధ్యక్షులను ఎన్నుకోనుండటంతో రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు రేపటి నుంచి జెడ్పీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. అదే రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో జిల్లా పరిషత్‌లకు కూడా కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. కోఆప్టెడ్ సభ్యుల పదవీకాలం సైతం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో ఆయా పదవులను దక్కించుకునేందుకు కూటమి పార్టీల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్