
హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వీటిలో రూ.451.13 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, రూ.92.98 కోట్ల విలువైన పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం భూమిపూజ చేయనున్నారు.
అలాగే జిల్లాలో ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మించిన 14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించనున్నారు.
మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి సత్రం, క్యూ కాంప్లెక్స్‌ను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి ప్రారంభం కానుండటంతో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్