
హైదరాబాద్ , 02 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు నిధులు సమకూర్చుకునే కేంద్రంగా మార్చుకుందని అయన తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణలో ప్రత్యేకంగా పన్నులు వసూలు చేస్తున్నారంటూ 'రాహుల్ ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్' పేర్లతో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా 'ఆర్ఆర్ ట్యాక్స్' రూపంలో సేకరిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోందని అమిత్ షా ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ రాజకీయ అవసరాలను తీర్చేందుకే తెలంగాణ నుంచి ఈ విధంగా నిధులు సమీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని అడ్డుకునే శక్తి ఎవరికి ఉందని ప్రశ్నించిన అమిత్ షా.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అడ్డుకుంటారా? లేక బీఆర్ఎస్ అడ్డుకుంటుందా? అంటూ నిలదీశారు. ఈ రెండు పార్టీల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కొని, రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించగలిగేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్