కైరోలో ఘోర ప్రమాదం.. హైవేపై పేలిన చమురు ట్యాంకర్
ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చమురు ట్యాంకర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
Accident


కైరో, 26 నవంబర్ (హి.స.)

ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. చమురు ట్యాంకర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందగానే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కైరోలోని గిజా గవర్నరేట్ పరిధిలోని ఇంబబా ప్రాంతం వరాక్ జిల్లాలో కీలకమైన రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. చమురు ట్యాంకర్ హైవేపై వెళ్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి దాని ముందు పడింది. దీంతో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ క్రమంలో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అగ్నికీలలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి.

ట్యాంకర్ పేలుడు ధాటికి హైవేపై ఉన్న వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు రెండు డజన్లకు పైగా కార్లు, బైక్ లు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పలువురు వాహనాల్లోనే చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వాహనాల నుంచి బాధితులను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande