కంటోన్మెంట్ సీఈవో పనితీరుపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం
తాను 26 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతోమంది అధికారులు, వివిధ వ్యవస్థల పనితీరును చూశానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
Mp


హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)

తాను 26 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతోమంది అధికారులు, వివిధ వ్యవస్థల పనితీరును చూశానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

కంటోన్మెంట్ లో ప్రస్తుత సీఈఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పనితీరును గమనిస్తున్నామని, మార్పు వస్తుందని ఎదురుచూసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కంటోన్మెంట్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సీఈఓ వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదని ఈటల విమర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్లను కాదని, అలహాబాద్ నుంచి శానిటేషన్ కాంట్రాక్టర్ ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఈఓపై కేంద్ర రక్షణ మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు.

కంటోన్మెంట్ లో పారిశుద్ధ్య నిర్వహణ పేరుతో చెత్త సేకరించే కూలీలు, స్కావెంజర్ల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. నిధులు ఆదా అవుతున్నాయనే కారణంతో కార్మికులను తగ్గించడం సరైన నిర్ణయం కాదన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయకపోవడం, సిబ్బందిని తొలగించడం, జీతాలు చెల్లించకపోవడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande