అమరావతిపై కొందరు విషప్రచారం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.
Chandrababu Naidu


అమరావతి , 27 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా గొడ్డలి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రుల వద్ద ప్రస్తావించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం నిర్మించడం వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారని, వారి త్యాగాలను కొందరు ఎగతాళి చేయడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదే సందర్భంగా డిసెంబర్ 1న హార్టికల్చర్ హబ్ను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు, దానికి ప్రత్యేకంగా సీఈవోను నియమిస్తున్నట్లు చెప్పారు. కేవలం ప్రారంభోత్సవంతో సరిపెట్టకుండా, నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande