
కడప జిల్లా, 27 నవంబర్ (హి.స.)
కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు, దాడులు నిర్వహించి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేశారు.
ఈ వివరాలను కడప జిల్లా అటవీశాఖ అధికారి బాలరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 114 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఏడు వాహనాలను అధికారులు గుర్తించి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అటవీ సంపదను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలరాజు హెచ్చరించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని, అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్