
సిద్దిపేట, 27 నవంబర్ (హి.స.)
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులను కోరారు.
ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, అందుకే ఈ సూచన చేస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం సింగాయపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సుమారు వందేళ్ల క్రితం జరిగిన భూ సర్వే తర్వాత తలెత్తిన సర్వే నంబర్ల సమస్యలు, హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూ భారతి రీ-సర్వే చేపట్టిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ముందుగా ప్రభుత్వ, అటవీ, నీటిపారుదల, రైల్వే భూముల కొలతలు పూర్తి చేసి, ఆయా శాఖల అధికారుల సంతకాలు తీసుకున్న తర్వాతే పట్టా భూముల సర్వే చేపట్టాలన్నారు.
సర్వేకు రెండు రోజుల ముందే రైతులకు సమాచారం అందించి, ముందు రోజు గ్రామసభ నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోవర్ యంత్రాల సహాయంతో రోజువారీ లక్ష్యాల ప్రకారం ఖచ్చితత్వంతో, పారదర్శకంగా సర్వే చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు