వారాంతపు ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్కు నష్టాలు..
వారాంతపు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
Stock market


ముంబై, 27 నవంబర్ (హి.స.)

వారాంతపు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస లాభాలతో దూసుకెళ్తున్న మార్కెట్ కు చమురు ధరల పెరుగుదల బ్రేక్ వేసింది. పశ్చిమాసియాలో మరోసారి తలెత్తిన ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దానికి తోడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ముఖ్యంగా ఆటోమొబైల్, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో రోజంతా సూచీలు నష్టాల్లోనే కదలాడాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 84,093.24 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. అంతకుముందు సెషన్ లో 84,328.59 పాయింట్ల వద్ద ముగిసిన సూచీ ప్రారంభం నుంచే ఒత్తిడిని ఎదుర్కొంది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 83,208.33 పాయింట్లకు పడిపోయింది. చివరికి 989.33 పాయింట్లు కోల్పోయి 83,339.26 వద్ద స్థిరపడింది.

మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. రోజంతా అమ్మకాల ఒత్తిడిలో కొనసాగిన సూచీ చివరకు 277.30 పాయింట్లు తగ్గి 25,607.20 వద్ద ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande