
హైదరాబాద్ , 03 నవంబర్ (హి.స.)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ప్రచారం, కుట్రలను నిరసిస్తూ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పాదయాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎస్ఐఆర్పై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు మద్దతుగా తమ వైఖరిని తెలియజేయడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బండి సంజయ్ రాకతో నిర్మల్లో రాజకీయ సందడి నెలకొనే అవకాశం ఉంది. పాదయాత్రలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీ శ్రేణులకు ఈ కార్యక్రమం ద్వారా మరింత ఉత్సాహం కల్పించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్