
అమరావతి , 03 నవంబర్ (హి.స.)
మురసు తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను పరిస్థితులు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వర్షాల కారణంగా కాలువలు, చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తుపాను పూర్తిగా ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్