భారీ వర్షాల హెచ్చరిక.. నేడు ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
School


ఎన్టీఆర్ జిల్లా, 03 నవంబర్ (హి.స.)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ శాఖ అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించడంతో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా విజయవాడలోని మొగల్రాజపురం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. కొండ ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న ప్రజలను ముందుగానే గుర్తించి, ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, కాలువలు, నీరు ప్రవహించే మార్గాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande