మానవతావాది అడిషనల్ జడ్జికి ఘన వీడ్కోలు
బోధన్లో అదనపు న్యాయమూర్తిగా పనిచేసిన సాయి శివకు అక్కడి న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది ఎంతో ఆప్యాయంగా వీడ్కోలు చెప్పారు.
Judge


నిజామాబాద్, 07 నవంబర్ (హి.స.)

బోధన్లో అదనపు న్యాయమూర్తిగా పనిచేసిన సాయి శివకు అక్కడి న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది ఎంతో ఆప్యాయంగా వీడ్కోలు చెప్పారు. తన పదవీకాలం ముగియడంతో ఆయన యాదాద్రి భువనగిరికి బదిలీపై వెళ్తున్నారు. న్యాయం కోసం వచ్చే ప్రతి వ్యక్తిని సొంత మనిషిలా చూసుకుంటూ, భిన్నమైన పద్ధతిలో సేవ చేసినందుకు ఆయనకు ఈ ఘన సత్కారం దక్కింది.

2023 అక్టోబర్లో మొదటి పోస్టింగ్లోనే బోధన్కు వచ్చిన సాయి శివ, మూడు సంవత్సరాల వ్యవధిలో రెండు వేలకు మించిన కేసులను పరిష్కరించారు. కేవలం కోర్టు పనులకే పరిమితం కాకుండా న్యాయ సేవా కార్యక్రమాలు చేపట్టారు, స్కూల్ పిల్లలకు చట్టాల గురించి తెలియజెప్పడానికి ముందుకు వచ్చారు. తప్పు చేసిన వారి పట్ల గట్టిగా వ్యవహరించినా, బాధతో కోర్టుకు వచ్చే వారి పట్ల మాత్రం ఎంతో సహనంతో, జాలితో మెలిగేవారు. కుటుంబ తగాదాలు, పెళ్లి సంబంధిత వివాదాల్లో రెండు వైపులా విని, అర్థం చేసుకుని పరిష్కారం చూపేవారు. అందుకే గత ఏడాది ఆయనకు దయగల న్యాయమూర్తి అనే పేరు వచ్చింది.

2025 ఏప్రిల్లో కాళ్లు సరిగా ఆడని వృద్ధ దంపతులు తమ బాధ చెప్పుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు, ఆయనే స్వయంగా బయటకు వచ్చి వారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేలా చేసింది. న్యాయం అంటే కేవలం తీర్పు చెప్పడం మాత్రమే కాదని, బాధితుల కష్టాన్ని అర్థం చేసుకోవడం కూడా అని ఆయన ఆచరణలో చూపించారు. ఖాళీ సమయం దొరికితే చాలు ప్రభుత్వ బడులకు వెళ్లి పిల్లలతో మాట్లాడుతూ చట్టాలు, హక్కులు, బాధ్యతల గురించి చెప్పేవారు. దాంతో ఆయన కేవలం న్యాయమూర్తిగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత ఉన్న మనిషిగా కూడా అందరి మనసుల్లో నిలిచిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande