
హైదరాబాద్, 07 నవంబర్ (హి.స.)
శనివారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓదెల మండలంలో పర్యటించారు. ముందుగా గోపరపల్లి, హరిపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్వయంగా చూశారు. తర్వాత ఓదెల ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి అక్కడ పని తీరు, పథకం అమలు, పనులు ఎంతవరకు వచ్చాయో సమీక్షించారు.
ఆ సమయంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. వీబీజీ రామ్ పథకాన్ని సరిగ్గా వాడుకుని గ్రామాల్లో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా సాగునీటి కాలువల్లో పూడిక తీసే పనులను నాణ్యతగా చేసి, చెప్పిన సమయానికే పూర్తి చేయాలని గట్టిగా చెప్పారు. కాలువల్లో అడ్డంకులు తొలగితేనే రైతులకు నీరు సరిగ్గా అందుతుందన్నారు.
ప్రతి ఊరిలో అక్కడి అవసరాన్ని బట్టి పనులను ఎంచుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఆఫీసులు, మహిళా సంఘాల భవనాలు పథకం నిబంధనల ప్రకారం కట్టాలని, సగంలో ఆగిపోయిన భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతిరోజూ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరగాలన్నారు. పని చేసే చోట తాగే నీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. హాజరు, మస్టర్లు, కొలతలు, డబ్బుల వాడకంలో ఎక్కడా తేడా లేకుండా అంతా పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు