భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. హడావుడిగా అమెరికాతో బంగ్లా ఒప్పందం
హైదరాబాద్, 10 ఫిబ్రవరి (హి.స.) భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్.. ఆగమేఘాల మీద అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా -బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు సోమవారం ఒక కీలకమైన
Bangladesh


హైదరాబాద్, 10 ఫిబ్రవరి (హి.స.)

భారత్ - అమెరికా మధ్య ట్రేడ్ డీల్

జరగడంతో ఆందోళన చెందిన బంగ్లాదేశ్.. ఆగమేఘాల మీద అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా -బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు సోమవారం ఒక కీలకమైన 'పరస్పర వాణిజ్య ఒప్పందం' (Agreement on Reciprocal Trade) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా మార్కెట్కు బంగ్లాదేశ్ చేసే ఎగుమతులపై సుంకం (Tariff) గతంలో ఉన్న 20 శాతం నుండి 19 శాతానికి తగ్గనుంది. గత ఏడాది ఆగస్టులో 20 శాతంగా ఉన్న పరస్పర టారిఫ్ను తాజా ఒప్పందంతో 19 శాతానికి తగ్గించారు. ఒకప్పుడు ఇది 37 శాతంగా ఉండేది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పత్తి, కృత్రిమ నూలు (Man-made fibre) ఉపయోగించి బంగ్లాదేశ్ తయారు చేసే దుస్తుల ఎగుమతులపై సున్నా శాతం (0%) టారిఫ్ విధించేలా వాషింగ్టన్ అంగీకరించింది.

ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సంబంధాలను ఒక చారిత్రాత్మక స్థాయికి తీసుకెళ్తుందని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీర్ ఉద్దీన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ వాణిజ్య కార్యదర్శి మహబుబూర్ రెహమాన్, అమెరికా అసిస్టెంట్ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ...._ ట్రంప్ నాయకత్వంలో అమెరికా కార్మికులు వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చేలా వాణిజ్య విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. దక్షిణాసియాలో ఈ తరహా ఒప్పందం జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

టారిఫ్ తగ్గింపు తమ ఎగుమతిదారులకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని బంగ్లాదేశ్ ముఖ్య సంప్రదింపుల అధికారి రెహమాన్ తెలిపారు. ముఖ్యంగా అమెరికా ముడిసరుకుతో తయారయ్యే వస్త్రాలపై సున్నా సుంకం ఉండటం తమ గార్మెంట్ రంగానికి పెద్ద ఊతం ఇస్తుందన్నారు. ఈ ఒప్పందానికి బంగ్లాదేశ్ సలహాదారుల మండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇరు ప్రభుత్వాలు అధికారిక నోటిఫికేషన్లు జారీ చేసిన వెంటనే ఈ ఒప్పందం అమలులోకి రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande