భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. ఫ్యాక్ట్‌షీట్‌లో పలు మార్పులు చేసిన ట్రంప్ సర్కార్
అమెరికా-భారత్ మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్‌పై రాబోయే మార్చి నెలలో తుది సంతకాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే డీల్‌లోని కీలక అంశాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్‌ను అమెరికా విడుదల చేసింది.
Trade deal US India


హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)అమెరికా-భారత్ మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్‌పై రాబోయే మార్చి నెలలో తుది సంతకాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత డీల్‌లోని కీలక అంశాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్‌ను అమెరికా విడుదల చేసింది. అయితే ఆ ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని అంశాల పట్ల భారత్‌‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కొన్ని గంటల్లోనే ఆ ఫ్యాక్ట్ షీట్‌లోని ఇబ్బందిరక అంశాల్లో అమెరికా మార్పులు చేసింది.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలను తగ్గిస్తుందని మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో వైట్ హౌస్ పేర్కొంది. ఈ విషయంపై భారత్‌లో వ్యతిరేకత వచ్చింది. ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద పప్పు ధాన్యాల ఉత్పత్తిదారు. అలాగే పప్పు ధాన్యాల వినియోగం విషయంలో కూడా భారతదేశమే నెంబర్ వన్. ఈ నేపథ్యంలో అమెరికా పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాలను తగ్గిస్తే ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయంలో భారత్ నుంచి వ్యతిరేకత రావడంతో అమెరికా దిగి వచ్చింది .

పప్పు ధాన్యాల దిగుమతులపై భారత్ సుంకాలను తగ్గిస్తుందని మొదట పేర్కొన్న అమెరికా, రెండో ఫ్యాక్ట్ షీట్‌లో ఆ ప్రస్తావన లేకుండా చేసింది.అలాగే 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తుల కొనుగోలుకు భారత్ 'కట్టుబడి ఉంది' అని తొలుత పేర్కొన్న అమెరికా.. ఆ తర్వాత దానిని 'కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉంది' అని మార్చింది.

అలాగే భారతదేశం డిజిటల్ సేవల పన్నులను తొలగిస్తుందనే వాదనలను కూడా ట్రంప్ బృందం వెనక్కి తీసుకుంది. డిజిటల్ సేవల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించే నియమాల గురించి చర్చించడానికి భారతదేశం కట్టుబడి ఉందని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande