
నామకాల్, 16 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై తీవ్ర చర్చ జరుగుతుండగా.. తమిళనాడులో మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) నిరసన గళం విప్పారు.
ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని ఆరోపిస్తూ, ఆయన బహిరంగంగా బిల్లు ప్రతులను తగులబెట్టి సంచలనం సృష్టించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ మంటలు కేవలం కాగితాలను కాల్చడం లేదని, ఇవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అహంకారాన్ని అణచివేస్తాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణ రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పిలుపుతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. డీఎంకే శ్రేణులు ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని, ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV