
న్యూఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)
లోక్సభలో నేడు డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ యువ నేత, ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూనే, కాంగ్రెస్ హయాంలో జరిగిన రాష్ట్ర విభజన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల జీఎల్డీపీ (GSDP) ఆధారంగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తేజస్వీ సూర్య కొట్టిపారేశారు సీట్ల సంఖ్యను జీఎస్డీపీ ముడిపెట్టాలన్న రేవంత్ రెడ్డి సలహా అత్యంత మూర్ఖత్వంగా (Foolish) ఉందన్నారు. అసలు ఆయనకు ఆ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ, దీనిని చూసి తెలంగాణ ప్రజలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాల ఆదాయం అనేది ప్రతి ఏటా మారుతూ ఉంటుందని, దానిని డీలిమిటేషన్కు ప్రాతిపదికగా తీసుకోవడం హాస్యాస్పదమని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. ఆదాయం ప్రకారమే ఓట్లు లేదా ప్రాతినిధ్యం ఇవ్వాలని అనుకుంటే, దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాల్సి వస్తుందని సైటైర్లు వేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ (Congress) చేసిన విభజన బ్రిటీష్ వారి కంటే చెత్తగా ఉందని.. ఏపీ విభజనను పాకిస్తాన్ (Pakistan) విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు