మారణహోమం నుంచి ప్రజాస్వామ్యం వైపు.. బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం
ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నెలల తరబడి సాగిన రక్తపాతం, తీవ్ర సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ నేడు తన 13వ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ
Bangladesh


ఢిల్లీ,12, ,ఫిబ్రవరి (హి.స.) నెలల తరబడి సాగిన రక్తపాతం, తీవ్ర సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్ నేడు తన 13వ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ ఎన్నికలు, బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ పోలింగ్ కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కాకుండా, రాజ్యాంగ సంస్కరణలపై జరుగుతున్న 'జూలై జాతీయ చార్టర్' ప్రజాభిప్రాయ సేకరణను కూడా నిర్ణయించనుంది.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ గడచిన రెండేళ్లలో అనేక చీకటి రోజులను చూసింది. రాజకీయ అస్థిరత ముదిరి మారణహోమానికి దారితీయడం, ముఖ్యంగా మైనార్టీలైన హిందువులు, క్రైస్తవులు లక్ష్యంగా జరిగిన దాడులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెట్టాయి. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంతో, ఈసారి ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాత్-ఎ-ఇస్లామీ మధ్య నెలకొంది. ఎన్నికల ముంగిట కూడా రాజకీయ విమర్శలు, అరెస్టులు, మైనార్టీ వర్గాల్లో నెలకొన్న భయాందోళనల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఓటింగ్ కొనసాగుతోంది.

పోటెత్తిన యువ ఓటర్లు

గత రెండు సంవత్సరాల నుంచి నిరసనలు, మారణహోమాలకు అట్టుడికిపోయిన బంగ్లాదేశ్ నేడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తుంది. ఈ క్రమంలో 13వ పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో.. యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో బంగ్లాదేశ్ లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. మరీ ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువకులు ఎంతో ఆసక్తితో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో సామాన్య ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీకి కేవలం రాజ్యాధికారం మాత్రమే కాకుండా, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపడం అతి పెద్ద సవాలుగా మారనుంది. అవినీతి నిర్మూలన, ఉపాధి కల్పన వంటి హామీలతో పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి.

సుదీర్ఘ ఘర్షనలు, రక్తపాతం, నిరసనలు, మైనార్టీల హత్యల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం బంగ్లాదేశ్కే కాకుండా భారత్ వంటి పొరుగు దేశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా మారాయి. కొత్తగా వచ్చే ప్రభుత్వం భారత్తో సంబంధాలను ఎలా కొనసాగిస్తుంది. సరిహద్దు భద్రత, మైనార్టీల రక్షణపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జెన్-జీ (Gen Z) నిరసనకారుల స్ఫూర్తితో వచ్చిన ఈ ఎన్నికలు, బంగ్లాదేశ్ను మతతత్వ రాజకీయాల నుంచి తప్పించి నిజమైన ప్రజాస్వామ్య పథంలో నడిపిస్తాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande