
వాషింగ్టన్, 14 ఫిబ్రవరి (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పంపిన బలగాలకు తోడుగా, మరో శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌకను (Aircraft Carrier) రంగంలోకి దించుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇరాన్ తీరులో మార్పు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ దేశం సరైన ఒప్పందానికి వస్తే తప్ప తమ సైనిక చర్యలు ఆగే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ట్రంప్ తేల్చి చెప్పాడు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఇరాన్ కేవలం చర్చల పేరుతో కాలయాపన చేసిందే తప్ప, ఆచరణలో ఏమీ చూపడం లేదు. గత 47 ఏళ్లుగా వారు మాటలతోనే కాలం గడుపుతున్నారు. ఈ లోపు అమెరికా ఎందరో వీర జవాన్లను కోల్పోయింది. అంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది సైనికులు తమ కాళ్లు, చేతులు, ముఖాలు కోల్పోయి వికలాంగులుగా మారారని, ఈ రక్తపాతం చాలా కాలంగా కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతానికి ఇరాన్ సరిహద్దులకు భారీ స్థాయిలో అమెరికా సైన్యం చేరుకుందని, త్వరలోనే మరో యుద్ధనౌక కూడా అక్కడ మోహరించబడుతుందని ట్రంప్ తెలిపారు. ఈ సమస్యను ఒక్కసారిగా, శాశ్వతంగా పరిష్కరించడమే మా లక్ష్యం. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ చర్చల వైపు వస్తుందా, యుద్ధానికే మొగ్గు చూపుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాలని ట్రంప్ మీడియాతో చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV