
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అంతర్గత విచారణ, సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్సిటీ పరిధిలోని మూడో సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్(2025-26) పరీక్షలకు సంబంధించిన లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల నిర్వాకంపై కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. ఇందులో వరంగల్ వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కార్తిక్ కీలకపాత్ర వహించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసే సమయంలో అతను సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి..ఇన్‌సర్వీస్ విద్యార్థుల(ఏఈవోలు)కు పంపినట్లు విచారణాధికారులు నిర్ధారణకు వచ్చారు. కార్తిక్ బ్యాంకు ఖాతాలలో పెద్దఎత్తున నగదు లావాదేవీలున్నట్లు గుర్తించారు. దర్యాప్తు క్రమంలో మరికొన్ని ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వివరాలు బహిర్గతమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అనుమానంతో మొదలై..
క్లిష్టతరంగా భావించే ఓ పరీక్షలో ఇన్‌సర్వీస్ స్టూడెంట్లు అసాధారణ రీతిలో మార్కులు సాధించడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొ.అల్దాస్ జానయ్య, డీన్ ఝాన్సీరాణి గతేడు డిసెంబరు 24న జగిత్యాలలోని వ్యవసాయ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. నవంబరు 17న ఆ పరీక్ష జరిగిన రోజు సీసీ కెమెరాలను పరిశీలించి..రమేశ్ అనే విద్యార్థి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎంటమాలజీ హెచ్‌వోడీ డా.నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.అంజయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.ఎన్.పి.రవికుమార్, డా.సంపత్‌లతో కూడిన అంతర్గత విచారణ బృందాన్ని వర్సిటీ నియమించింది. ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలిలా..
ఒకర్నుంచి.. మరొకరికి చేరిందిలా..
మిడ్ ఎగ్జామ్స్ సహా.. మరిన్ని ప్రశ్నపత్రాలు బయటికి
మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ మిడ్ ఎగ్జామ్స్ ప్రశ్నాపత్రాలు కూడా లీకైనట్లు, సిరిసిల్ల బీజేఆర్ వ్యవసాయ కళాశాలలో పొరుగు సేవల సిబ్బంది అజయ్ వాటిని లీక్ చేసినట్లు అంతర్గత విచారణ బృందం గుర్తించింది. అతని సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసే క్రమంలో గతంలో జరిగిన మరికొన్ని సెమిస్టర్ల ప్రశ్నాపత్రాలు అందులో ఉన్నట్లు గుర్తించి విస్తుపోయింది. దీన్నిబట్టి కొన్నేళ్లుగా ఇన్‌సర్వీస్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ కొనసాగి ఉంటుందనే అనుమానాలు బయటపడ్డాయి. సీఐడీ దర్యాప్తులో మరికొందరి పాత్ర బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్