
ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.)
వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా 9వ వార్డు కౌన్సిలర్ కట్ల సంతోష్ ఎన్నికయ్యారు. వైరాలోని మున్సిపాలిటీ కార్యాలయం లో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించారు. ముందుగా ఎన్నికల అధికారి అయిన ఖమ్మం ఆర్డీవో గరిడే నరసింహారావు కౌన్సిలర్లచే వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.
ఏడు ఓట్ల మెజార్టీతో చైర్మన్ వైస్ చైర్మన్ గెలుపు..
వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా ప్రముఖ గైనకాలజిస్ట్, 6వ వార్డు కౌన్సిలర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ 7 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చంద్రకళ 5వ వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి పై చైర్మన్ గా గెలుపొందారు. అదేవిధంగా కట్ల సంతోష్ 10వ వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా కాపా చంద్రకళను 4వ వార్డు కౌన్సిలర్ నిమ్మతోట శ్రావణి ప్రతిపాదించగా, 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి బలపరిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా కట్టా స్వరూపరాణిని 12వ వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రతిపాదించగా, 11వ వార్డు కౌన్సిలర్ దొంతెబోయిన వెంకటేశ్వర్లు బలపరిచారు. అనంతరం ముందుగా చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారి నరసింహారావు నిర్వహించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు