
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)వైసీపీ సభ్యుల నిరసనలతో శానసమండలి వాయిదా పడింది. టీటీడీ లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. వైసీపీ ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, కేఆర్‌జే భరత్‌లు ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై చర్చకు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా తీర్మానాలు ఇవ్వడం విశేషం.
మండలి చైర్మన్.. ఈ తీర్మానాలను తిరస్కరిస్తూ, ఒకసారి తిరస్కరించిన వాయిదా తీర్మానాన్ని మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
అంతకుముందు అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై గ్రిప్ కోల్పోయారని అన్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పరస్పరం విరుద్ధంగా రెండు వాయిదా తీర్మానాలు ఇచ్చారని తెలిపారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చకు డిమాండ్ చేస్తుంటే.. మరొకరు హిందాపూర్ డైయిరీపై చర్చ అడుగుతున్నారన్నారు. వారి కోట్లాటలో ఎవరు పై చేయి సాధిస్తారో తమకు ఆసక్తిగా ఉందన్నారు. ‘సభలో మా స్ట్రాటజీ ఏంటో మీరు చూస్తారుగా’ అంటూ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్