
మహబూబ్నగర్, 18 ఫిబ్రవరి (హి.స.)
ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా జీవితంలో గొప్పగా స్థిరపడతారని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హితవు పలికారు. బుధవారం భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పదవ తరగతి విద్యార్ధుల ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసిన హిందీ పేపర్ ను పరిశీలించి, ఈ రోజు హిందీ పేపర్ ఎలా రాశారని, ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని, ఆహార నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేస్తూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంతో జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని హితవు పలికారు.
అవ్వా.. డాక్టర్ వైద్యం బాగా చేస్తున్నాడా? మందులు ఇస్తున్నారా అని కలెక్టర్ విజయేందిర బోయి ఆసుపత్రికి వచ్చిన ఒక వృద్ధురాలుని అడిగి తెలుసుకున్నారు. భూత్పూర్ మండల కేంద్రంలో కెజిబివి ని తనిఖీ అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపి లో వివరాలను, ఇన్ పేషెంట్ వార్డు, ల్యాబ్, ఔషధాలు, ప్రసూతి తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవాల గురించి వాకబు చేసి, ప్రతినెల గర్భిణీల జాబితా ప్రకారం వారికి పరీక్షలు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు