
జోగులాంబ గద్వాల, 24 ఫిబ్రవరి (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న అకాల వర్షం మిర్చి రైతుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట, చేతికందే సమయంలో వర్షార్పణం అవుతుందేమోనని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. కళ్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లతో రైతులు యుద్ధం చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న, కంది పంటలు దెబ్బతింటాయని, అకాల వర్షం కురిస్తే రైతులకు కోలుకోలేని దెబ్బ తప్పదని రైతులు వాపోతున్నారు. మిర్చి పంట తీసిన క్షణము నుండి వైరస్ సోకడం.. పంతులను తొలగిస్తూ మళ్లీ వేసుకున్నారు.
తీరా పంట చేతికొచ్చిందని ఆశ పడేలోపే.. అక్కడ వర్షం కంటిమీద కునుకు లేకుండా రైతన్నను వేధిస్తుంది. గత రెండేళ్లుగా మిర్చి పంటతో రైతన్నలు భారీగా నష్టపోయారు. ఈ ఏడాదైనా కాస్త విడిచి పంటలు చేతికొచ్చి లాభసాటి ధర ఉండటంతో పంటలపై చేసుకున్న అప్పులు తీరుతాయని గట్టి నమ్మకం ఉంది. కానీ అకాల వర్షం కాస్త రైతులను భయపెడుతుంది. మిర్చి పంటలపై పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో తెలియని స్థితిలో, ఆకాశం వైపు చూస్తూ వరుణుడా.. మమ్మల్ని కరుణించు అని మానవపాడు అన్నదాతలు వేడుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు