
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald
Trump) ప్రవేశపెట్టిన కీలక వలస విధానానికి అమెరికా ఫెడరల్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను వారి స్వదేశాలకు కాకుండా, మూడో దేశాలకు (Third Countries) బలవంతంగా పంపించివేసే విధానం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పునిచ్చారు. వలసదారులను ఏ దేశానికి పంపిస్తున్నారో వారికి ముందుగా తెలియజేయకుండా (Notice), ఆ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం కల్పించకుండా పంపడం రాజ్యాంగ విరుద్ధమని జడ్జి బ్రియాన్ మర్ఫీ స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తికైనా లభించే 'డ్యూ ప్రాసెస్'(Due Process) చట్టపరమైన సరైన ప్రక్రియ హక్కును ఈ విధానం ఉల్లంఘిస్తోందని 81 పేజీల తీర్పులో పేర్కొన్నారు. వలసదారులకు సంబంధం లేని దేశాలకు వారిని పంపడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేసుకునేందుకు వీలుగా జడ్జి తన ఉత్తర్వుల అమలుపై 15 రోజుల పాటు స్టే విధించారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దుల వద్ద కఠినమైన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా వలసదారులను వారి సొంత దేశాలకు కాకుండా, ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతర దేశాలకు పంపించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాలు కోర్టులో సవాలు చేయగా.. తాజాగా వారికి అనుకూలంగా అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు