
పోలవరం 28 ఫిబ్రవరి (హి.స.)
, :రంపచోడవరం మండలంలోని తాళ్లపాలెం గ్రామ సమీపంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఓ ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత నాలుగు రోజులుగా పులి కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనావాసాలకు సమీపంలోనే పులి సంచరిస్తుండటంతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితి. ఇటీవల అటవీ శాఖ అధికారులు పాపికొండలు అభయారణ్యంలో పెద్ద పులిని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పులి ఆవులపై దాడి చేస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.
కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు బంధించి విశాఖపట్నం జూకు తరలించారు. ఆపై పులిని పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టారు. పులి మెడలో జియో-ట్రాకింగ్ కెమెరా/కాలర్ ఉంచారు. దాని కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. ఇప్పుడు అదే పులి రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి సంచారం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్లో భయాందోళన నెలకొంది. పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. గ్రామస్తులు రాత్రిపూట బయట తిరగవద్దని, పశువులను సురక్షితంగా ఉంచాలని ప్రజలకు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ