
ఆదోని, 28 ఫిబ్రవరి (హి.స.)
కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన రైతు రామలింగప్ప ఈ రోజు ఉదయం గిట్టుబాటు ధర లేక తన సొరకాయ పంటను రోడ్డుపై పారబోశాడు. రెండెకరాల్లో సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటకు మార్కెట్లో కొనుగోలుదారులు లేకపోవడంతో కూలీల ఖర్చులు కూడా రాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను ఎన్నో ప్రయాసలకోర్చి సాగు చేసిన సొరకాయ పంటను తన చేతులతో కావాలనే రోడ్డు పాలు చేశాడు ఓ రైతు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన రైతు రామలింగప్ప తన రెండెకరాల్లో సొరకాయ పంట సాగు చేశాడు. సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి పంటను పెంచగా, దిగుబడి బాగానే వచ్చింది. కానీ మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆయన తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. స్థానిక మార్కెట్కు సొరకాయలను తీసుకెళ్లినా కొనుగోలుదారులు లేకపోవడంతో, కూలీలకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోయింది. చేసేదేమీ లేక గ్రామ రోడ్డుపై సొరకాయలను పారబోసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.
రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు వర్షాభావం, మరొకవైపు అకాల వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయి. చేతికి వచ్చిన కొద్దిపాటి పంటకైనా గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.3 నుంచి 4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినా సరైన దిగుబడి లేక, ధరలు రాక అప్పుల భారంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబాలతో కలిసి కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రామలింగప్ప విజ్ఞప్తి చేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV