
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)విపక్షాల నినాదాలు, నిరసనలతో లోక్‌సభ ఎటువంటి కార్యకలాపాలనూ చేపట్టలేకపోయింది. ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుపడటంతో సోమవారానికి వాయిదాపడింది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆరోపిస్తూ...విపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యంలోకి దూసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే 19 గంటలకు పైగా సభా సమయం వృథా అయ్యిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా సభ్యులు వెనక్కితగ్గకపోవడంతో ఇలాంటి సభను నిర్వహించలేనని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సమావేశమైనప్పటికీ సభలో నిరసనలు కొనసాగాయి. సభ్యులు కూర్చోవాలని, ప్లకార్డులు తొలగించాలంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి విజ్ఞప్తి చేశారు. అయినా విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లోక్‌సభ వాయిదాపడిన అనంతరం కాంగ్రెస్ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు పార్లమెంటు మకర ద్వారం వద్ద గుమిగూడారు. ‘నియంతృత్వాన్ని సహించం’, ‘నరేందర్ సరెండర్’, ‘ప్రజాస్వామ్యాన్ని హత్యచేయడాన్ని ఆపండి’ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ అయిన ఎంపీలు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్