
న్యూఢిల్లీ, 07 ఫిబ్రవరి (హి.స.) పార్లమెంటు ఎగువసభలో (రాజ్యసభ)
బీజేపీ నామినేటెడ్ ఎంపీ సి. సదానందన్ మాస్టర్ చేసిన తొలి ప్రసంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సదానందన్ ప్రసంగంలో ఆయన నైతిక బలం, దృఢ నిశ్చయం ఉట్టిపడ్డాయని ప్రధాని ప్రశంసిస్తూ.. ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు.
కృత్రిమ కాళ్లను చూపిస్తూ.. సంచలన ప్రసంగం..
ఇటీవల రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేస్తూ సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాళ్లను (Artificial Limbs) సభకు చూపించారు. మూడు దశాబ్దాల క్రితం కేరళలో సీపీఐ(ఎం) కార్యకర్తలు జరిపిన దాడిలో తాను కాళ్లను కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య అప్పట్లో సభలో పెద్ద దుమారం రేపింది. సీపీఐ(ఎం) నేతలు దీనిని డ్రామా అని విమర్శించినప్పటికీ, ప్రధాని మోదీ మాత్రం ఆయన ధైర్యాన్ని అభినందించారు.
ప్రధాని లేఖలోని ముఖ్యాంశాలు..
మీరు పార్లమెంటుకు కొత్త కావొచ్చు, కానీ దేశం పట్ల మీకున్న నిబద్ధత, మీ జీవితకాల సేవ అసమాన్యం. మీరు ప్రసంగిస్తుంటే మీ మాటల్లోని నైతిక బలం నాకు కనిపించింది అని మోదీ పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడిపై ఇంతటి దారుణమైన దాడి జరగడం మన ప్రజాస్వామ్యం జీర్ణించుకోలేని విషయమని ప్రధాని అన్నారు. నాడు దాడి చేసిన తిరోగమన భావజాలం (Retrograde ideology) కుంచించుకుపోయింది.. కానీ మీరు నేడు సగర్వంగా పార్లమెంటులో కూర్చున్నారు అని లేఖలో రాశారు.
కేరళలోని రాజకీయ పరిస్థితుల పట్ల సదానందన్ వ్యక్తం చేసిన ఆవేదనను ప్రధాని సమర్థించారు. కేరళ ప్రజలు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పాలనతో విసిగిపోయారని, 'వికసిత్ కేరళ' విజన్ (Vikasit Kerala Vision) వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రధాని నుంచి లేఖ అందడంపై సదానందన్ మాస్టర్ X (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు నరేంద్ర మోదీ జీ నుండి ప్రశంసా పత్రం అందుకోవడం నా అదృష్టం. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నా సేవకు మరింత శక్తిని ఇస్తుంది అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు