
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)
భారత అండర్-19 క్రికెట్ జట్టు
ఆరోసారి ప్రపంచకప్ విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఛాంపియన్ జట్టుకు రూ.7.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.
ఫిబ్రవరి 6న జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ అజేయంగా టోర్నమెంట్ ముగించి టైటిల్ కైవసం చేసుకుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. ఒత్తిడిలోనూ యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ఆయన అన్నారు.
2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మా జట్టుపై దేశమంతా గర్విస్తోంది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన తీరు, టోర్నమెంట్ మొత్తం అజేయంగా కొనసాగిన తీరు ఎంతో ప్రశంసనీయం. అందుకే జట్టుకు రూ.7.5 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నాం,” అని సైకియా తెలిపారు. ఫైనల్ మ్యాచ్లో యువ భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో విజయం వైపు అడుగులు వేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే నాయకత్వంలో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. అతను 175 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తర్వాత మరో 23 బంతుల్లో రెండో అర్ధశతకం పూర్తి చేసి ఇంగ్లండ్ బౌలర్లను నిరాశపరిచాడు. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. కేలెబ్ ఫాల్కనర్ శతకం సాధించి పోరాడినా, మిగతా బ్యాట్స్మెన్ సహకారం అందలేదు. భారత బౌలర్లు తరచూ వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్ను కట్టడి చేశారు. చివరకు ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌటై, భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..