
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ.స్మృతి, వోల్ మెరుపులు.వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్‌ను అప్పగించింది. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయభేరి మోగించింది. విజేత ఆర్‌సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), లౌరా వోల్‌వార్ట్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు రాణించారు. ఆఖర్లో షినెల్ హెన్రీ (15 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది.
తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు.
రెండు ఓవర్లలో 39 పరుగులు.
ఢిల్లీ టాప్–4 బ్యాటర్లు లిజెల్లీ లీ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోల్‌వార్ట్, జెమీమా సమష్టిగా పరుగులు సాధించారు. దీంతో 18 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. డిక్లెర్క్ వేసిన 19వ ఓవర్లో షినెల్ హెన్రీ 4, వైడ్, 4, 4, 4, 6, 1 ఇలా బంతిని పదేపదే బౌండరీ లైన్ దాటించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఆఖరి ఓవర్ వేసిన సయాలీ 6, 4తో కలిసి 15 పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు ఓవర్లలోనే 39 పరుగులతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది.
శుభారంభం దక్కకున్నా...
ఆరంభంలోనే హిట్టర్ గ్రేస్ హారిస్ (9) వికెట్‌ను కోల్పోయినా... స్మృతి, వోల్‌ల ధనాధన్ షో ఢిల్లీ ఆశల సౌధాన్ని కూల్చేసింది. 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో కెపె్టన్ స్మృతి పూర్తి చేసుకున్న ఫిఫ్టీలు బెంగళూరును సాఫీగా లక్ష్యంవైపు నడిపించాయి. ఆఖర్లో వీళ్లిద్దరితో పాటు రిచా (6) అవుటైనా... ఎలాంటి డ్రామా లేకుండా, రాధ యాదవ్ (12 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీలతో ముగించింది. 243 పరుగులు సాధించిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్