
దిల్లీ: 01 మార్చి (హి.స.)దేశ రాజధానిలో ఇటీవల నిర్వహించిన ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న నిరసన ప్రదర్శనలకు దిగిన కేసులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్కు శనివారం మెజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేయగా.. దీనిపై కొన్ని గంటల వ్యవధిలోనే సెషన్స్ కోర్టు స్టే విధించింది. తొలుత నాటకీయ పరిణామాల మధ్య దిల్లీ కోర్టు డ్యూటీ మెజిస్ట్రేటు వంశికా మెహతా శనివారం తెల్లవారుజామున ఉదయ్ భానుకు బెయిలు మంజూరు చేశారు. పోలీస్ కస్టడీని పొడిగించాలన్న దిల్లీ పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. ఉదయ్ భానుకు కొన్ని షరతులను కోర్టు విధించింది. ఆయన తన పాస్పోర్టు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు రూ.50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ