
హైదరాబాద్, 10 మార్చి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock
Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అలాగే యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్ను బలపరిచాయి.
దాంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 800 పాయింట్లు మేర ఎగబాకింది. ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 600కు పైగా పాయింట్ల లాభంతో 78,100 పాయింట్లపైన ఉండగా.. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పుంజుకుని 24,200 మార్కుపైన ట్రేడవుతోంది. అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఓఎన్టీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ సోమవారం ఒక బ్యారెల్కు 119 డాలర్ల వరకు పెరుగగా తాజాగా 89 డాలర్లకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 8 శాతం మేర పెరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు