
దిల్లీ: 12, మార్చి (హి.స) మన దేశం ఇటీవల ఖరారు చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏల) వల్ల 465 బిలియన్ డాలర్ల (సుమారు రూ.43 లక్షల కోట్ల) విలువైన మార్కెట్లకు అవకాశాలు లభించాయని, అక్కడకు 200 బి.డాలర్ల (సుమారు రూ.18 లక్షల కోట్ల) ఎగుమతులు చేసే వీలుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం తెలిపారు. ఇంతటి భారీ అవకాశాన్ని దేశీయ వస్త్ర పరిశ్రమ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫైబర్, నూలు, దుస్తులు, సాంకేతిక వస్త్రాలు, స్థిరమైన ఆవిష్కరణల వరకు మొత్తం వస్త్ర వాల్యూ వ్యవస్థను ఒక చోట చేర్చే ప్రయత్నం చేస్తున్నందున, భారత్ టెక్స్ 2026 దేశీయ సంస్థలకు అతిపెద్ద ప్రపంచ వేదికగా మారబోతోందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, ఒమన్, యూఏఈ, ఈయూ వంటి దేశాలతో 9 ఎఫ్టీఏలను మన దేశం ఖరారు చేసింది. మన దేశం యంత్రాల తయారీలో బలహీనంగా ఉన్నందున, దీన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమను మంత్రి కోరారు.
4 రోజుల పాటు జరగబోయే భారత్ టెక్స్ 2026 ప్రదర్శన, జులై 14 నుంచి దిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన ద్వారా మన దేశం ఒక నమ్మకమైన, స్థిరమైన వస్త్రాలకు పెట్టుబడి గమ్యస్థానంగా ఉన్న ఆకర్షణను కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. 3,500 మందికి పైగా వ్యాపార ప్రదర్శనకారులు, 140కి పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదార్లు, 1,30,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొంటారని అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ