
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)
హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ రూపకల్పన తుది దశకు చేరుకున్నది. ఇందులో ఎకానమిక్ డెవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), కంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), బ్లూ, అండ్ గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లకు నివేదికలు రూపొందించారు. వాటిలో ముఖ్యంగా ప్రజారవాణాకు మొబిలిటీ ప్లాన్ కీలకంగా మారింది. కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)-2050 అమలుకు రూ.నాలుగు లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది. దీంతో పాటు ప్రజారవాణాను మెరుగుపర్చడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టులపై లీ అసోసియేట్స్ కీలక అంశాలపై సిఫార్సులు చేసింది.
హైదరాబాద్ లో మొదటి దశలో 69కి.మీ. మెట్రోరైలు నడుస్తున్నది. రెండో దశలో భాగంగా (ఏ) 76.4 కి.మీ.లు, (బీ) 86.1 కి.మీ పొడవును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 231కి.మీ.కు చేరనుంది. దీన్ని 2030 ໖ 258.4 3.2, 2040 ໖ 435.13.2, 2050 నాటికి 566.63.2. విస్తరించాలని ప్రతిపాదించారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని సైతం 336 కి.మీ.కు పెంచాలని ప్లాన్ రూపొందించారు.
మెట్రోపాలిటన్ ఏరియాలో రోడ్ నెట్ వర్క్ ను సైతం పెంచాలని ప్రతిపాదించారు. 11 జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు రోడ్లకు సైతం అప్ గ్రేడ్ చేయనున్నారు. మొత్తం 19,352 లేన్ కి.మీ.కు పెంచాలని సూచించారు. కొత్త రోడ్లతో పాటు లేన్ కిలోమీటర్లను సైతం పెంచాలని ప్రతిపాదించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రేడ్ సపరేటర్లతో పాటు కొత్తగా మరో 75 నిర్మించాలన్నారు. వాటితో పాటు 34 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, 120 ప్రాంతాల్లో పాదచారుల వంతెనలు నిర్మించాలని గుర్తించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల మాదిరిగా మరో 8 ఎలివేటెడ్ రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా 29 బ్రిడ్జిలను నిర్మించేందుకు అవకాశం ఉందని గుర్తించారు. వీటితో పాటు 2040 వరకు 29 కి.మీ. డెడికేటెడ్ బస్ లేన్లు, 2050 వరకు 48కి.మీ. మార్గాలను సైతం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవేకాకుండా ఏడు ప్రాంతాల్లో ఇంటర్ సిటీ, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్, ట్రక్ టర్మినల్స్ సైతం నిర్మించాలని ప్రతిపాదించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..