
హైదరాబాద్, 13 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ గృహ సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు . శుక్రవారం ఆయన సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి గృహ వినియోగదారుడికి అవసరమైన మేర సిలిండర్లు సరఫరా చేస్తామని మంత్రి భరోసానిచ్చారు. గృహ అవసరాల గ్యాస్ను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ (Black Market) చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ విక్రయాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలకు (Hostels) ఎలాంటి అంతరాయం లేకుండా సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిత్యవసర వస్తువుల సరఫరాలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..