
హైదరాబాద్, 14 మార్చి (హి.స.)హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన రెండు ఎల్పీజీ టాంకర్లకు ఇరాన్ అనుమతించింది. దీంతో భారత జెండాలున్న రెండు ఇంధన నౌకలు శనివారంనాడు హోర్ముజ్ జలసంధిని దాటి ఇండియాకు పయనమయ్యాయి. రెండు మూడు గంటల్లోనే హోర్ముజ్ మీదుగా భారత ఇంధన నౌకలకు అనుమతి లభించనున్నట్టు భారత్లోని ఇరాన్ రాయబారి చెప్పిన కొద్ది గంటలకే 'శివాలిక్', 'నందాదేవి' నౌకలకు ఆదేశం నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. ఇరాన్, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల సహకారంతో అత్యంత జాగ్రత్తగా జరిపిన ఆపరేషన్ ఇదని అధికార వర్గాలు తెలిపారు. కొద్దిరోజులుగా ఇండియా, ఇరాన్ నాయకత్వం మధ్య పలు రౌండ్ల చర్చల అనంతరం రెండు నౌకలకు హోర్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతి లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హోర్ముజ్ జలసంధిలో 28 భారతీయ జెండాలతో ఉన్న నౌకలు చిక్కుకుపోవడంతో వాటిని సురక్షితంగా జలసంధి దాటించేందుకు భారత్ కొద్దిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల నాలుగు రౌండ్లు చర్చలు జరిపారు. ఫిబ్రవరి 28, మార్చి 5, 10, 12 తేదీల్లో ఫోనులో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఈనెల 12న ఫోనులో సంభాషించారు.
భారత్కు బయలుదేరిన శివాలిక్ సుమారు 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ లోడ్తో ఉండగా, నందాదేవి నౌకలోనూ పెద్దమొత్తంలో గ్యాస్ లోడ్ ఉంది. ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్తో వెళ్తున్న మరో భారత నౌక జాగ్ ప్రకాష్ సైతం హోర్మూజ్ జలసంధిని దాటేందుకు సిద్ధంగా ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలోని మర్చంట్, హార్బర్, ఆఫ్షోర్ నౌకల్లో సుమారు 23,000 మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్