
న్యూఢిల్లీ, 14 మార్చ్ (హిం.స)
రష్యా నుండి చమురు కొనవద్దని
ఇండియాపై అమెరికా చాలాకాలంగా ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇండియా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొన్న దేశాల్ని నిన్నటివరకు బెదిరించి, ఇప్పుడు అదే రష్యా చమురును కొనుగోలు చేయాలని బ్రతిమాలడం ఏంటని ఇరాన్ అంటోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి శనివారం అమెరికాపై విమర్శలు గుప్పించారు. “రష్యా నుంచి చమురు కొనొద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ప్రారంభమైన రెండు వారాలకే తిరిగి రష్యా చమురు కొనాలని ఇండియాను, ప్రపంచాన్ని వేడుకుంటోంది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న అక్రమ యుద్ధానికి యురోపియన్ యూనియన్ సహకరిస్తోంది. ఇది కూడా రష్యాకు వ్యతిరేకంగానే అంటూ అరాగ్చి పేర్కొన్నారు. ఇక.. ఇండియా తమ మిత్ర దేశమే అని, అందువల్ల హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇండియన్ నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ నౌకలు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతానికి మరో రెండు నౌకలు జలసంధి నుంచి బయల్దేరాయి. రెండు దేశాల మధ్య సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని ఇండియాను అమెరికా చాలా కాలంగా కోరింది. అలాగే ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా దీనికి ఇండియా అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. దీనికి తగ్గట్లే రష్యా చమురు కొనుగోలును ఇండియా తగ్గించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఈ లోపే ఇరాన్ వార్ జరగడం, హోర్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకలు నిలిచిపోవడంతో ఇతర దేశాల నుంచి ఇండియాకు చమురు రవాణా ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా సూచించింది. 30 రోజులపాటు అనుమతిస్తున్నామని అమెరికా పేర్కొంది. కానీ, అమెరికా ప్రకటనను ఇండియా ఖండించింది. తాము వేరే దేశం నుంచి చమురు కొనేందుకు అమెరికా అనుమతి అవసరం లేదని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..